Bharatiya Janata Party భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ (భాజపా), భారతదేశంలోని ప్రముఖ జాతీయస్థాయి రాజకీయపార్టీలలో ఒకటి. 1980లో ప్రారంభిం...
![]() |
| Bharatiya Janata Party |
భారతీయ జనతా పార్టీ
భారతీయ జనతా పార్టీ (భాజపా), భారతదేశంలోని ప్రముఖ జాతీయస్థాయి రాజకీయపార్టీలలో ఒకటి. 1980లో ప్రారంభించిన ఈ పార్టీ దేశములోని హిందూ అధికసంఖ్యాక వర్గ మత సాంఘిక, సాంస్కృతిక విలువల పరిరక్షనే ధ్యేయంగా పనిచేస్తోంది. సాంప్రదాయ సాంఘిక నియమాలు, దృఢమైన జాతీయవాదం (భాజపా) యొక్క భావజాలాలు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధానపాత్ర పోషిస్తున్న సంఘ్ పరివార్ కుటుంబానికి చెందిన వివిధ రకాల హిందూ జాతీయవాద సంస్థలు భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల స్థాయిలో గట్టి పునాదిని ఇస్తున్నాయి.
పార్టీ స్థాపన నుండే, భాజపా భారత జాతీయ కాంగ్రేసు ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. భారతీయ రాజకీయరంగం లో నాలుగు దశాబ్దాలపాటు ఆధిపత్యము వహించిన కాంగ్రేసు పార్టీ వామపక్ష ధోరణులను తిప్పివేసేందుకు భాజపా ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. అయితే భాజపా భావజాల నినాదము మాత్రం హిందుత్వమే (సాంస్కృతిక హిందూ జాతీయవాదం).
భాజపా, అనేక ఇతర పార్టీల మద్దతుతో 1999 నుండి 2004 వరకు భారతదేశ ప్రభుత్వము భారత కేంద్ర ప్రభుత్వాన్ని పాలించింది. దాని సీనియర్ నాయకులైన అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగాను, లాల్ కృష్ణ అద్వానీ ఉప ప్రధానమంత్రిగానూ పనిచేశారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో ప్రధాన పార్టీ అయిన భాజపా, భారత పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షముగా 2014 మే వరకు కొనసాగింది.
2014 సార్వత్రిక ఎన్నికలలో లోక్ సభ లోని 543 స్థానాలకు మునుపెన్నడూ లేనన్ని 281 స్థానాలు గెలుచుకున్న భాజపా (మిత్ర పక్షాలతో కలిసి జాతీయ ప్రజాస్వామ్య కూటమికి 337 స్థానాలు) నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారం చేబట్టింది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభ ఎన్నికల్లో 303 స్థానాల్లో విజయం సాధించింది. నరేంద్ర మోడీ నాయకత్వంలో మళ్లీ అధికారం చేపట్టింది.
చరిత్ర | పార్టీ ఆవిర్భావం
భారతీయ జనతా పార్టీ మాతృ పార్టీ అయిన జనసంఘ్ 1952లో ఏర్పాటైంది. దీనిని జాతీయోద్యమ నేత, మాజీ కేంద్ర మంత్రి అయిన శ్యాంప్రసాద్ ముఖర్జీ ఏర్పాటు చేశాడు. ఇది హిందూ జాతీయవాద సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కు రాజకీయ విభాగంగా పరిగణించబడింది. జనసంఘ్ స్థాపకుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ జైలులో ఉండగా 1953లో మరణించాడు. ఆ తర్వాత జనసంఘ్ 24 సంవత్సరాలు కొనసాగిననూ ఏ రాష్ట్రంలోనూ పార్లమెంటు లోనూ చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. తొలి సార్వత్రిక ఎన్నికలలో ఈ పార్టీ కేవలం 3 స్థానాలను మాత్రమే పొందినది. కాని క్రమంగా పుంజుకుంటూ వచ్చింది. అయిననూ ఇది భారత జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన భారత జాతీయ కాంగ్రెస్కు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. కాని అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీ లాంటి భవిష్యత్తు నాయకుల తయారీకి మాత్రం దోహదపడింది.
1975లో ఇందిరా గాంధీ అంతర్గత అత్యవసర (Emergency) పరిస్థితిని విధించి రాజ్యాంగము కల్పించిన అధికారాన్ని దుర్వినియోగపర్చిన తర్వాత జరిగిన 1977 ఎన్నికలలో మరో 3 రాజకీయ పక్షాలతో కలిసి జనతా పార్టీగా ఏర్పడి కాంగ్రెస్ తో పోటీకి నిలబడింది. అత్యవసర పరిస్థితి కాలంలో ఎందరో జనసంఘ్ నాయకులను, కార్యకర్తలను జైలులో ఉంచగా ఆ దురదృష్టకర పరిస్థితిని జనతా పార్టీలో భాగంగా ఉన్న మాజీ జనసంఘ్ నేతలు సద్వినియోగపర్చుకున్నారు. 1977 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ కు ముఖ్యంగా ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా పోరాడి జనతా పార్టీని గెలిపించుకున్నారు. ఆ తర్వాత మురార్జీ దేశాయ్ నాయకత్వంతో కేంద్రంలో ఏర్పడిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంలో అటల్ బిహారీ వాజ్‌పేయి కీలకమైన విదేశాంగ మంత్రి హోదా పొందగా, లాల్ కృష్ణ అద్వానీ సమాచార శాఖా మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాడు.రెండు సంవత్సరాల స్వల్పకాలంలోనే జనతా పార్టీ ప్రభుత్వం పతనం కావడం, జనతా పార్టీలో చీలిక రావడంతో పూర్వపు జనసంఘ్ నేతలు ఆ పార్టీని వదలి బయటకు వచ్చి 1980, ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు.
తొలినాళ్ళు
అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీ లచే 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ స్థాపించబడింది. అటల్ బిహారీ వాజ్‌పేయి భాజపా తొలి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. 1984లో, ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికలలోకాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించగా, భాజపా 543 నియోజకవర్గాలలో ఒకటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లోని హనుమకొండ కాగా, ఏకే పటేల్ అనే బీజేపీ అభ్యర్థి గెలుపొందిన గుజరాత్ లోని మెహ్సానా నియోజక వర్గం రెండోది. హనుమకొండ నుంచే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్ సభలో బీజేపీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తి చందుపట్ల జంగారెడ్డి. ఇక ఆ ఎన్నికల్లో వాజ్‌పేయి, అద్వానీ వంటి బీజేపీ అగ్రనాయకులందరూ పరాజయం పాలయ్యారు.543 నియోజకవర్గాలలో కేవలం రెండింటిని గెలుపొందింది. లాల్‌కృష్ణ అద్వానీ రథయాత్ర ఫలితంగా 1989 లోక్‌సభ ఎన్నికలలో 88 సీట్లను గెలుచుకొని జనతాదళ్‌కు మద్దతునిచ్చి వీ.పీ.సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడటానికి కారణం అయింది. అయోధ్యలో రామజన్మభూమి మందిరాన్ని కట్టాలనే ప్రయత్నంతో రథయాత్రలో ఉన్న అద్వానీని బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్టు చేసిన సందర్భాన అక్టోబరు 23, 1990న భాజపా తన మద్దతును వెనక్కి తీసుకోగా తదుపరి నెలలో జనతాదళ్ ప్రభుత్యం పడిపోయింది.
1991 లోక్‌సభ ఎన్నికలలో మండల్, మందిర్ ప్రధానాంశాలుగా జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తన స్థానాలను 120కి పెంచుకొని ప్రధాన ప్రతిపక్షంగా మారింది. కాంగ్రెస్ మైనార్టీ ప్రభుత్వంగా పాలన కొసాగించింది. 1996 లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అతి పెద్ద రాజకీయ పక్షంగా అవతరించింది. అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ అటల్ బిహారో వాజ్‌పేయిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించగా బి.జే.పి. ప్రభుత్వం లోక్‌సభ విశ్వాసం పొందుటలో విఫలమైంది. తత్ఫలితంగా వాజ్‌పేయి ప్రభుత్వం 13 రోజులకే పతనమైంది. 13 రోజులు అధికారంలో ఉన్నప్పుడు భాజపాకు కేవలం మూడే మూడు మిత్రపక్షాలు (శివసేన, సమతాపార్టీ, హర్యానా వికాస్ పార్టీ) ఉండేవి.
మొదటి భాజపా ప్రభుత్వం
1998లో లోక్‌సభ ఎన్నికలను మళ్ళీ నిర్వహించగా భారతీయ జనతా పార్టీకి మళ్ళీ అత్యధిక స్థానాలు లభించాయి. ఈ పర్యాయం భారతీయ జనతా పార్టీ ఇతర రాజకీయ పార్టీలతో కల్సి జాతీయ ప్రజాతంత్ర కూటమి (NDA) ను స్థాపించంది. NDA కు లోక్‌సభలో బలం ఉన్నందున అటల్ బిహారీ వాజపేయి ప్రధాన మంత్రిగా కొనసాగినారు. కాని 1999 మే మాసములో ఆల్ ఇండియా అన్నా డి.యం.కే అధినేత్రి జయలలిత భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని ఎన్.డి.ఏ. ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకొనగా మళ్ళీ ఎన్నికలు అనివార్యమయ్యాయి. లోక్‌సభలో విశ్వాస సమయంలో వాజ్‌పేయి ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో విశ్వాసం కోల్పోయింది. 1999 అక్టోబరులో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్.డి.ఏ. కూటమి 303 లోక్‌సభ స్థానాలను గెల్చింది. భారతీయ జనతా పార్టీకి ఇదివరకెన్నడు లభించనంత 183 స్థానాలు లభించాయి. అటల్ బిహారీ వాజ్‌పేయి ముచ్చటగా మూడో పర్యాయం ప్రధాన మంత్రి పీఠాన్ని అధిరోహించారు. అద్వానీకి ఉప ప్రధానమంత్రి హోదా లభించింది. ఈ సారి ఎన్.డి.ఏ. సంకీర్ణ ప్రభుత్వం పూర్తి 5 సంవత్సరాల కాలం అధికారంలో కొనసాగింది. భాజపా ప్రభుత్వం ప్రసార భారతి బిల్లుకు మద్దతు ఇచ్చి మీడియా ఛానళ్ళకు మరింత స్వయంప్రతిపత్తి కల్పించింది. ఈ బిల్లుకు భాజపా మద్దతు ఉన్న నేషనల్ ఫ్రంట్ హయంలోనే రూపుదిద్దాల్సి ఉన్నా అప్పటినుంచి వాయిదా పడుతూ వస్తోంది.
రెండవ భాజపా ప్రభుత్వం (1998-2004)
![]() |
| భాజపా రెండవ అధ్యక్షుడు లాల్ కృష్ణ అద్వానీ |
1998లో రాజస్థాన్ లోని పోఖ్రాన్లో 5 అణుపరీక్షలు జరిపి భారతదేశానికి అనధికార అణు హోదా ప్రతిపత్తిని కల్పించింది. అంతేకాకుండా కార్గిల్ పోరాటంలో పాకిస్తాన్ పై పైచేయి సంపాదించింది. మంచుపర్వతాలలో కూడా శక్తివంచన లేకుండా పోరాడే శక్తి భారత్ కు ఉందని నిరూపించింది. ఇవన్నీ వాజ్ పేయి ప్రభుత్వానికి కలిసివచ్చిన సంఘటనలే.
భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని జాతీయ ప్రజాతంత్ర కూటమి (NDA) 2002లో టెర్రరిస్ట్ నిరోధక చట్టాన్ని కూడా జారీచేసింది. ఈ చట్టం వల్ల ఇంటలిజెన్స్ కు మరింత అధికారం కల్పించినట్లయింది. 2001 డిసెంబర్ 13 న పార్లమెంటు పై టెర్రరిస్టుల దాడి కూడా ఈ చట్టం చేయడానికి దోహదపడింది.
ఇక ఆర్థిక రంగాన్ని పరిశీలిస్తే వాజ్‌పేయి నేతృత్వంలోని ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ప్రభుత్వ కార్పోరేషన్లను ప్రైవేటీకరించం, ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) నిబంధనల ప్రకారము సరళీకరణ, దేశంలో విదేశీ పెట్టుబడుల, ప్రత్యేక ఆర్థిక మండలుల (Special Economic Zones) ఏర్పాటు మొదలగు ఆర్థికపరమైన మార్పులు చేశారు. ప్రభుత్వం ఇన్పర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమల ఏర్పాటుకు కూడా తగిన శ్రద్ధ తీసుకుంది. మధ్య తరగతి వర్గాల కోసం పన్నులు తగ్గించబడ్డాయి. వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులు పెరిగాయి. దానితో బాటు విదేశీ వ్యాపారం కూడా వృద్ధి చెందింది. 2004లో ప్రభుత్వం సాప్టా (దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, South Asia Free Trade Agreement) పై పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వల్ల దక్షిణాసియా లోని 160 కోట్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. దేశంలో రవాణా సౌకర్యాలలో కూడా భాజపా నేతృత్వంలోని ఎన్.డి.ఏ.ప్రభుత్వం దృష్టి సారించింది. స్వర్ణ చతుర్భుజి పథకం కింద దేశం లోని నాలుగు మూలలా ఉన్న 4 ప్రధాన నగరాలైన ముంబాయి, ఢిల్లీ, చెన్నై, కోల్‌కత లను నాలుగు లేన్ల రహదారి ద్వారా కల్పే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది.
అప్పటి ప్రధాని హోదాలో వున్న వాజపేయి పాకిస్తాన్తో స్నేహసంబంధాలకై స్వయంగా ఒంటిచేత్తో మూడు నిర్ణయాలు తీసుకున్నారు. 1999లో ఢిల్లీ - లాహోర్ బస్సును ప్రారంభం చేశారు. పాకిస్తాన్ ప్రధానమంత్రితో లాహోర్ డిక్లరేషన్ పై సంతకం చేశారు. 2001లో కార్గిల్ సంక్షోభం తర్వాత పాకిస్తాన్ అధినేత పర్వేజ్ ముషారఫ్ ను భారత్ పిలిపించి చర్చలు జరిపారు, కాని ఆ చర్చలు విఫలమయ్యాయి. టెర్రరిస్టుల దాడి తర్వాత రెండున్నర సంవత్సరాలు భారత్-పాక్ సంబంధాలు క్షీణించిపోయాయి. అటువంటి ఆ సమయంలో ఆగస్టు 2004 వాజ్‌పేయి పార్లమెంటులో ప్రసంగిస్తూ "పాకిస్తాన్ తో స్నేహసంబంధాలకైనా జీవితంలోనే చివరి గొప్ప ప్రయత్నం చేస్తా"నని ప్రకటించి ప్రపంచ దేశాధినేతలను ఆకట్టుకున్నారు.
సిద్ధాంతాలు
భాజపా జాతీయవాదం, సంప్రదాయ, రాజకీయ సంస్థ. భాజపా భారతీయ సంసృతీ, భారతీయ మత వ్యవస్థలో భాగమైన హిందూ మతము, జైన మతము, సిక్కు మతము, బౌద్ధమతాలకు రక్షణగా నిలుస్తోంది. చాలామంది జాతీయవాదులకు భారత్ ఒక హైందవ రాష్ట్రం, అంటే హిందూ దేశం . ఇందులో భాజపా సిద్దాంతం ప్రకారం ముస్లిములు, క్రైస్తవులు మినహాయింపు కాదని, ఈ మతాలవారు కూడా హిందువులలో భాగమేనని వారి పూర్వికులు హిందువులే కాబట్టి వారి DNA హిందువేనని భాజపా భావిస్తుంది. హైందవ రాష్ట్రం అంటే సాంస్కృతిక జాతీయవాదం, గత 5000సంవత్సరాలు పైగా కాలక్రమేణా భారతదేశంలో పుట్టిన హైందవ సంస్కృతి, చరిత్ర, నమ్మకాలు, ఆరాధనలు అని అందుకే హైందవ రాష్ట్రం అని భాజపా సిద్ధాంతం చెబుతోంది. రాజకీయ పరిభాషలో హైందవ జాతీయవాదులు అంటే, భారత ప్రజలు అందరూ, వారి హైందవ వారసత్వ సంపద ఐనటువంటి సంస్కృతి సంప్రదాయాలు.మరో రకంగా చెప్పాలంటే " సింధూ (ఇండస్ నది) నది వాస్తవ్యులు లేదా వారి వారసులు" అని అర్ధం.
హైందవ రాష్ట్రం అనే సిద్దాంతం మొదట భారతీయ జన సంఘ్ ప్రతిపాదించింది. భాజపా ప్రధాన లక్ష్యం సనాతన హైందవ సంస్కృతీ విలువల స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం. పార్టీ కీలక సిద్దాంతకర్త అయిన దీనదయాళ్ ఉపాధ్యాయ రాసిన ఇంటిగ్రల్ హ్యూమనిజమ్ అన్యే పుస్తకంతో భాజపా హైందవ రాష్ట్రం సిద్దాంతానికి బీజాలు పడ్డాయి. ఉపాధ్యాయ సిద్ధాంతం ప్రకారం "రాజు", "రాజ్యము" అనేవి సమాజానికి "ధర్మం", "చిత్తం (సంస్కృత 'చిత్తి', అనగా ఉద్దేశం లేదా బుద్ది)" వంటివి. భారత సమజానికి సరైన అర్థం "జాతీయతా భావన" లోనే వున్నదని ఆయన పదే పదే చెప్పారు.
హిందూ (ఉపాధ్యాయ)శాస్త్రాల ప్రకారం, రాజు, రాజ్యం అంటే సమాజపు "ధర్మం", క్షితి. భారతీయ సమాజం అంటే "జాతీయ గుర్తింపు". భాజపా ప్రకారం, హిందూధర్మానుసారం మానవ జీవితం, కామం, అర్థం, ధర్మం, మోక్షములపై ఆధారపడియున్నది.. ప్రత్యుర్థుల నుంచి భాజపా ఒక నిరంకుశ సంస్థగా, అకారణ విదేశీ వ్యతిరేకత గలిగిన సంస్థగా నిందించబడుతూ ఉంది. అటు భాజపా మద్దతుదారులు అది జాతుల (మతాల)ఆధారంగా దేశాన్ని కోణీకరించడానికి (polarise) ఇష్టపడని ఒక కన్సర్వేటివ్, జాతీయ నిబద్ధత కలిగిన పార్టీ తప్పించి మరేమీ కాదని వాదిస్తారు. ఈ ఆరోపణల్లో చాలాభాగం భాజపాను బలహీనపరచడానికి వామపక్ష పండితులు చేసే దుష్ప్రచారమే.
భాజపా చరిత్ర, దాని పనితీరు 1947లో జరిగిన భారత విభజనవల్ల బలంగా ప్రభావితమైనట్టు కనిపిస్తుంది. భారతదేశంలోని చాలా మతాలకు బాధాకరమైన గతం ఈ విభజన. లక్షలాది జనం రక్షణార్థమై కొత్తగా ఏర్పడిన రెండు దేశాలకు వలసపోయారు. విభజన కాలంలో నెలకొన్న ఈ అరాచకంలో చెలరేగిన దారుణ మారణహోమంలో లక్షా యాభై వేలకు పైగా హిందువులు, సిక్కులును ముస్లిములు అతి కిరాతకంగా చంపారు. రాత్రికి రాత్రి తమ తాతలనాటి నుంచి వస్తున్న ఇళ్ళను వదలి మారణహింస, అలజడి, అయోమయాలను ఛేదించుకుంటూ వేరే దేశంలోని తమ కొత్త ఇంటికి పయనమవాల్సి రావటం, హిందూ జాతీయవాదుల నాడుల్లో లోతుగా నాటుకుపోయింది.
జమ్ము కాశ్మీర్ పైన జరుగుతున్న సరిహద్దు వివాదం, 1947-48, 1962, 1965, 1971ల యుద్ధాలు, ఇటీవల 1999 లో జరిగిన కార్గిల్ యుద్ధము భాజపా యొక్క సిద్ధాంత నిర్మాణంలోని మరొక ముఖ్యమైన అంశం. పాకిస్తాన్, ప్రజా గణతంత్ర చైనా, ఇతరత్రా వస్తున్న ముప్పులపై భారతదేశం ఒక కన్నేసి వుండాలన్నది భాజపా, దాని మద్దతుదారుల అభిమతం. మత హింసలో పాల్గొంటుందని, మతపరంగా సున్నితమైన అంశాలను రాజకీయ లాభాలకు వినియోగించుకుంటుందని భాజపాపై తరచుగా ఆరోపణలు వస్తూ వుంటాయి. ఎక్కువగా రాజకీయంగా దెబ్బదీసే ఉద్దేశంతో చేయబడే ఈ ఆరోపణలవల్ల భాజపా పట్ల ఉండాల్సిన సదభిప్రాయాన్ని చాలా మంది భారతీయులలో, ముఖ్యంగా ముస్లిములలో చీల్చివేసింది. చాలామంది వామపక్షవిలేఖరులు, విశ్లేషకులు భాజపాను స్పష్టమైన ముస్లిం వ్యతిరేక పక్షపాతపు నిరంకుశ సంస్థగా భావిస్తారు. గతంలో ముఖ్తర్ అబ్బస్ నక్వీ, దివంగత సికందర్ బఖ్త్, డా. నజ్మా హెప్తుల్లా, ఇండియన్ జ్యూ సమాఖ్యలో ప్రముఖ సభ్యుడు జె. ఎఫ్. ఆర్. జాకోబ్ వంటి ఎందరినో భాజపా తన కీలక స్థానాల్లో నిలబెట్టిందన్న నిజానికి ఈ అభిప్రాయం అలానే ఉంది.భాజపా డిమాండ్లలో, పనులలో కొన్ని నిర్ద్వంద్వంగా వివాదాస్పదమైనవి, జాతిపరమైన ఆందోళనలను రేకెత్తించేవి ఉన్నాయి. అయోధ్యలోని రామజన్మభూమి వీటన్నిటిలోకి ముఖ్యమైనది. మధ్యయుగ కాలంలో ముస్లిం దండయాత్రల్లో అయోధ్యానగరంలోని పురాతన దేవాలయాన్ని నాశనం చేసి, ఆ స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించారని వాదన. ఈ స్థలం విష్ణుమూర్తి అవతారాల్లో ప్రముఖమైన రామాయణ నాయకుడు శ్రీ రామ చంద్రమూర్తి జన్మస్థలంగా భావిస్తున్నందున ఆ హిందూ దేవాలయాన్ని పునర్నిర్మించేందుకు 1970లో విశ్వహిందూ పరిషత్ ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. రెండు దశాబ్దాలపాటు ఈ నిరసనలు శాంతియుతంగా జరిగాయి. కాని 1980ల చివరలో, అదివరకు ఎన్నడూలేనంతగా ఈ సమస్య వివాదాస్పదమయ్యింది. నేరుగా మసీదుని పడగొట్టాలని వి హెచ్ పి డిమాండ్ చేయటం మొదలుపెట్టగా, భాజపా దాన్ని తన సొంత సమస్యగా అక్కున చేర్చుకుంది. భాజపా కోర్కెలలో రామాలయం ప్రముఖతను సంతరించుకున్నాక, దాని కార్యకర్తలు పోరాట శ్రేణులలో చేరటం, అయోధ్యలో పెద్ద ర్యాలీలు నిర్వహించడం జరిగాయి.
భారతదేశంలోని అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో 1991 రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భాజపా గెలుపొంది, జాతీయస్థాయిలో ప్రాముఖ్యతను సంతరించుకోడానికీ ఈ భావశక్తి ఎంతగానో తోడ్పడింది. ఆయితే 1992 డిసెంబరు 6 న ఒక ప్రదర్శనకారుల గుంపు మసీదుపైకి దూసుకువచ్చి, చేతికొడవళ్ళు, పారలతో దాన్ని దెబ్బతీయడం వల్ల ఈ భావజాల దుర్వినియోగం (ఎమోషనల్ మ్యానిప్యులేషన్) హింసాత్మకంగా పరిణమించింది. తత్ఫలితంగా దేశవ్యాప్తంగా చెలరేగిన ఆగ్రహం, మారణహోమం, దోపిడీలు, దహనాల్లో వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి. ఈ మతఘర్షణల తర్వాత భారత లౌకికవాదమనే తీవెకు ముప్పువాటిల్లినట్లు చాలా వర్గాలు భావించాయి. వి హెచ్ పి నిషేధించబడగా, అద్వానీ, ఇతర నాయకులు అరెస్ట్ అయ్యారు. విధ్వంసానికి సంబంధించి సి. బి. ఐలో దాఖలైన ఛార్జి షీటులో ఉన్న ఇద్దరు భాజపా నాయకులు- అద్వానీ, మురలీ మనోహర్ జోషి. ఈ అరెస్టులు జరిగినప్పటికీ, భాజపా రాజకీయ పలుకుబడి శరవేగంతో పెరుగుతూ వచ్చింది.
సంస్థ
భారతదేశంలో గల రాజకీయ పార్టీలలో ఒకటైన భాజపా ప్రసిద్ధ పార్టీ. దీనికి అన్ని వర్గాలలోనూ సానుభూతిపరులున్నారు. ఈ పార్టీ భారతదేశమంతటా తన పార్టీ యంత్రాంగాన్ని కలిగివున్నది.
పార్టీ యొక్క అత్యున్నత నాయకుడు పార్టీ అధ్యక్షుడు. భాజపా అధికారిక నియమావళి ప్రకారం అధ్యక్షుని పదవీకాలము మూడేళ్ళు. అధ్యక్షుని క్రింది స్థాయిలో అనేక ఉపాధ్యక్షులు, సాధారణ కార్యదర్శులు, ట్రెజరర్లు, కార్యదర్శులు ఉంటారు. పార్టీలో అత్యున్నత స్థాయి నిర్ణయాధికార సంఘమైన జాతీయ కార్యవర్గ సంఘంలో అనిర్ణీత సంఖ్యలో దేశం నలుమూలల నుండి సీనియర్ పార్టీ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్రాలలో కూడా జాతీయస్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థ ఉంది. రాష్ట్ర స్థాయిలో పార్టీకి మూడు సంవత్సరాలు పదవిలో కొనసాగే ఆయా రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, అధ్యక్షత వహిస్తారు.
భాజపా క్రిందిస్థాయి కార్యకర్తలంతా ముఖ్యంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ యొక్క లక్షలాది సభ్యులనుండి వచ్చినవారే. భాజపా, సంఘ పరివారం యొక్క సంస్థలైనటువంటి విశ్వ హిందూ పరిషత్, స్వదేశీ జాగరణ్ మంచ్ (దిగుమతి చేసుకున్న విదేశీ వస్తువుల స్థానే స్థానికంగా తయారయ్యే జాతీయ ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహించే సంస్థ) లతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది.
భారతీయ జనతా పార్టీకి చెందిన వివిధ సంస్థలు క్రింద ఇవ్వబడినవి:
- భారతీయ జనతా యువమోర్చా (యువకుల కొరకు)
- భారతీయ కిసాన్ సంఘ్ (రైతుల కొరకు)
- భారతీయ మజ్దూర్ సంఘ్ (కార్మిక కర్షకుల కొరకు)
- భా.జ.పా. మహిళా మోర్చా (స్త్రీల కొరకు)
- భా.జ.పా. మైనారిటీ మోర్చా (మైనారిటీల కొరకు)
- భారతదేశం బయట, భా.జ.పా. అభిమానులు 'ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీ.జే.పీ.' అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారు.
భారతీయ జనతా పార్టీ ఆశయాలు , విధానాలు:
భారతదేశాన్ని శక్తివంతమైన, సౌభాగ్యకరమైన దేశంగా తీర్చిదిద్దడం, భారతదేశపు ఘనమైన ప్రాచీన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పడం, దేశాన్ని అభివృద్ధిపథంలోకి పయనింపజేయడం, ప్రపంచంలో భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్ది ప్రపంచశాంతి, అంతర్జాతీయ న్యాయంలో భారత పాత్రను పెంచడం మొదలగునవి పార్టీ సిద్ధాంతాలలో ఉన్న కొన్ని విశాలమైన ఆశయాలు. అంతాకాకుండా దేశాన్ని శక్తివంతమైన ప్రజాస్వామిక రాజ్యంగా తీర్చిదిద్ది పౌరులందరికీ కుల, మత, లింగ భేదాలు లేకుండా రాజకీయ, ఆర్థిక, సాంఘిక న్యాయాన్ని, స్వేచ్ఛను కల్పించడం పార్టీ ఆశయాలుగా పెట్టుకుంది.
భాజపా కేంద్ర ప్రణాళిక హిందూ జాతీయవాదం నుండి స్ఫూర్తి పొందింది. ఈ దిగువన ఉన్న విషయాలు ఏ ప్రత్యేక క్రమంలో లేకున్నా భాజపా ప్రధాన లక్ష్యాలను ఈ క్రింది విధంగా క్రోడీకరించవచ్చు.
- భారత రాజ్యాంగంలోని 370వ అధికరణం తొలగింపు, ఈ అధికరణం ముస్లిం ఆధిక్యత ఉన్న జమ్మూ కాశ్మీరు రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి నిస్తుంది. దీనిలో ఆ రాష్ట్ర ముస్లిం ఆధిక్యతను కాపాడటానికి కాశ్మీరేతరులు అక్కడ స్థిరాస్థిని సంపాదించడాన్ని నిరోధించటం వంటి ప్రత్యేక హక్కులు ఉన్నాయి. భారతదేశంలో జమ్మూ కాశ్మీరు పూర్తిస్థాయి రాజకీయ, భౌగోళిక విలీనాన్ని సాధించటం. ప్రస్తుతం జమ్మూ కాశ్మీరు భూభాగంలో 40% పైగా పాకిస్తాన్, చైనాల ఆధీనంలో ఉంది. జమ్మూ కాశ్మీర్ పునఃరేఖికరణ.
- యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్ ను ప్రకటించడం (The Promulgation of a Uniform Common Civil Code), దీని అనుసారం హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు, సమాన సాధారణ పౌరచట్టం తయారు చేయడం, తద్వారా మతపరమైన తారతమ్యాలను తొలగించి, దేశమంతటా ఒకే చట్టపు ఛాయలో అన్ని మతస్తుల వారికి తేవడం.
- గోవధను నిషేధించడం, గోవులను పవిత్రంగా భావించి వాటిని గౌరవించే హిందూ సంప్రదాయానికి అనుగుణంగా ఆవులను చంపటం, మాంసాన్ని తినటాన్ని నిషేధించడం.
- విదేశీమతమార్పిడులపై నిషేధం విధించండం. బలవంతపు మార్పిళ్ళను, స్వేచ్ఛాయుత వ్యక్తిగత మార్పిళ్ళను వేరుగా గుర్తించంటం చాలా కష్టమని, అందువల్ల మతమార్పులను నిషేధించాలని భాజపా వాదిస్తుంది.
- అయోధ్యలో రామజన్మభూమి ఆలయ నిర్మాణం. ముస్లిములు, ప్రభుత్వాల చెరనుంచి దేవాలయాలకు స్వాతంత్రం ఇవ్వడం. Free Temples.
- జనాభ నియంత్రణ చట్టం
- CAA, NPR, NRC
- హిందురాష్ట్ర
- అఖండ భారత ఉపఖండం
భాజపా పఠిష్టమైన జాతీయ భద్రత, చిన్న ప్రభుత్వం, స్వేచ్ఛా విఫణీ వాణిజ్యాల కోసం పాటుపడినా, ఆవిర్భావం నుండి హిందుత్వనే ఈ పార్టీ ప్రధాన తత్త్వం. 1990వ దశకంలో అప్పటిదాకా స్వదేశీ వస్తువుల వినియోగానికి మద్దతునిచ్చిన భాజాపా, యువతకోసం ప్రపంచీకరణ దృష్ట్యా స్వేచ్ఛా వాణిజ్య విధానాలను స్వాగతించడం ఒక అనూహ్యమైన మలుపుగా భావిస్తున్నారు.
అధ్యక్షులు
- అమిత్ షా - 2014 - నేటి వరకు
- రాజ్ నాథ్ సింగ్ - 2013 - 2014
- నితిన్ గడ్కరి - 2009 - 2013
- రాజ్ నాథ్ సింగ్ - 2005 - 2009
- లాల్ కృష్ణ అద్వానీ - 2004-2005
- వెంకయ్య నాయుడు - 2002-2004
- జానా కృష్ణమూర్తి - 2001-2002
- బంగారు లక్ష్మణ్ - 2000-2001
- కుషభావ్ థాక్రే - 1998-2000
- లాల్ కృష్ణ అద్వానీ - 1993-1998
- మురళీ మనోహర్ జోషి - 1991-1993
- లాల్ కృష్ణ అద్వానీ - 1986-1991
- అటల్ బిహారీ వాజ్‌పేయి- 1980-1986
ఓటు బ్యాంకు
భాజపా సాంప్రదాయక ఓటు బ్యాంకు ముఖ్యంగా హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాలలోని మధ్యతరగతి హిందూ సాంస్కృతిక సాంప్రదాయవాద ప్రజలుగా ఉండేది. కానీ 1998-2004 మధ్యకాలంలో వాజ్‌పేయ్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితంగా సాంప్రదాయవాదులు కాని, స్వేచ్ఛా వాణిజ్యానికి అనుకూలత చూపే దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలలోని మధ్య తరగతి పట్టణ ప్రజల మద్దతును కూడా పొందగలిగింది. భాజపా చిన్న పరిశ్రమలకు మద్దతుగా ప్రారంభించిన స్వదేశీ పరిరక్షణ ఉద్యమం స్వేచ్ఛా వాణిజ్యానికి దారి తీసింది.

